VIjayawada, MArch 13: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) మిస్టరీ మరణాలు (Mystry deaths)కలకలం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కల్తీ సారా వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో దీనిపై విచారణ చేపట్టారు అధికారులు. వేర్వేరు కారణాలతో వీరంతా మరణించారని జంగారెడ్డిగూడెం (Jangareddygudem) ఆర్డీవో చెప్తున్నారు. వరుస మరణాలపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తో మాట్లాడారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి పేర్ని నాని (Perni Nani) తెలిపారు. పోస్టుమార్టం తర్వాత అసలు విషయాలు బయటకొస్తాయని, ఎందుకు చనిపోతున్నారనే విషయం తెలిసిపోనుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Nara Chandrababu Naidu) రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శవరాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటై పోయిందని, జంగారెడ్డి గూడెం ఘటనపై బాబు అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అటు జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ (TDP) తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా? అని చంద్రబాబు నిలదీశారు. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని వాపోయారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సొంత చౌక మద్యం అధిక ధరలకి విక్రయిస్తున్నారని, ఆ మద్యం కొనలేక సారా తాగి ఇంత మంది బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపణలు చేశారు. ఎక్సైజ్, ఎస్ఈబీ, జగన్ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని లోకేష్ ప్రశ్నించారు. మరణాలపై ప్రభుత్వం, సంబధిత శాఖ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.