Nellore, JAN 24: విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తెలిపారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేశావని విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) మండిపడ్డారు. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగించావని అన్నారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్లా అని ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తును ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు.. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని.. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు.