TDP SpokesPerson Pattabhi (Photo-Facebook/TDP)

Amaravati, Oct 21: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు (Pattabhi Arrested) చేశారు. ముఖ్యమంత్రిని దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన పిర్యాదు మేరకు పట్టాభిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం రాత్రి గురునానక్‌నగర్‌లోని కనకదుర్గ ఆఫీసర్స్‌ కాలనీలో రోడ్‌ నంబర్‌ 7లోని ప్లాట్‌ నంబర్‌ 22లో పట్టాభి ఇంటికి చేరుకున్నారు. కాలింగ్‌బెల్‌ కొట్టినా స్పందించకపోవటంతో కొంతసేపు సంయమనంగా వ్యవహరించిన పోలీసులు తరువాత సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(3) మేరకు నోటీసు ఇచ్చారు. అనంతరం గవర్నర్‌పేట సీఐ ఎం.వి.ఎస్‌.నాగరాజ ఆయన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టాభి భార్య చందన పోలీసుల తీరును తప్పుపట్టారు.

భర్త అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ తన భర్త ఇంట్లో కూడా అసభ్యంగా మాట్లాడరని. బయట ఎలా మాట్లాడతారని చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వారున్నారని, కానీ అప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు కావాలనే అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.

తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు, అసాంఘీక శక్తులను ఏరి పారేయండి, సీఎంని బూతులు తిట్టే స్థాయికి వచ్చారు, పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్

పోలీసులపై నమ్మకం లేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అరెస్ట్‌కు (TDP SpokesPerson Pattabhi) ముందు పట్టాభి ఒక వీడియోను విడుదల చేశారు. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, తనకేమైనా జరిగితే ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని ఆ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులు పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన్ని గురువారం కోర్టులో హాజరుపరచే అవకాశం ఉందని సమాచారం. తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ఊళ్ళోకి వెళ్లే రోడ్లను సైతం పోలీసులు మూసేశారు. స్థానికులకు తప్ప ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని పోలీసులు చెబుతున్నారు.