kethireddy pedda reddy vs jc prabhakar reddy (Photo-X/Video Grab)

Tadipatri, Feb 3: తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈ ఘటనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వడం లేదని, తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా తీసుకోవాలా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. వీసా ఆఫీస్ ఎక్కుడుందో చెబితే అక్కడకు వెళ్లి అప్లై చేసుకుంటానని ఎద్దేవా చేశారు. తాడిపత్రికి వెళ్లడానికి కేతిరెడ్డి ఏర్పాట్లు చేసుకోగా... అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన పోలీసులు... పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలోని నివాసంలో గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి చిన్న బడ్డీకొట్టు వరకు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. అమాయకులను బెదిరింపులకు గురి చేసి, వారిపై దాడులు చేస్తూ తాడిపత్రిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గ్రామ దేవతకు దున్నపోతులను వదిలినట్టు కొంతమందిని వదిలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ... ప్రభాకర్ రెడ్డి తనను కవ్విస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tensions Erupt in Tadipatri:

రెచ్చగొడితే తాను రెచ్చిపోనని అన్నారు. ఏరోజైనా తాడిపత్రిలోని తన ఇంటికి వెళతానని చెప్పారు. తాడిపత్రికి తాను వెళితే శాంతిభద్రతల సమస్య ఎలా వస్తుందో పోలీసులు చెప్పాలని అన్నారు. ప్రభుత్వ నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే జేసీకి తాను కూడా సహకరిస్తానని తెలిపారు.

మరోవైపు, యల్లనూరు మండలం తిమ్మంపల్లికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి... వాహనాలను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్ల సహాయంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.