Road accident (image use for representational)

Nellore, June 12: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బూదవాడ సమీపంలో బద్వేల్‌–పామూరు రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో (Road Accident in Nellore) ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామానికి చెందిన కూలీలు బూదవాడ పరిసరాల్లో జామాయిల్‌ చెట్లను నరికే పనులకు నిత్యం వస్తుంటారు. శుక్రవారం రోజూలాగే కూలీ పనులకు వచ్చారు. సాయంత్రం ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో బద్వేల్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంకటరమణమ్మ (40) అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మర్రిపాడు 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటస్వామి (43), చిన్నయ్య (60) మృతిచెందారు. మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.