Tirumala, Nov 11: పవిత్రమైన తిరుమల భక్తి ఛానల్ ఆఫీసులో అశ్లీల వీడియోల కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసులో ఉద్యోగులు పోర్న్ వీడియోలు చూడటంపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోర్న్‌సైట్ వీడియో పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది.
శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.