Firecrackers (Photo Credits: IANS)

Amaravati, Nov 11: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దీపావళి సంబరాలపై (Diwali Celebrations in AP) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.

పేదలకు ఖరీదైన వైద్యం ఉచితం, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో తాజాగా 1,886 మందికి కరోనా

దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్‌ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు.