Amaravati, Nov 11: ఏపీలో గత 24 గంటల్లో 67,910 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,886 మందికి పాజిటివ్ (AP Corona Report) వచ్చినట్టు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,46,245కి చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 291 కరోనా కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరిలో 282, గుంటూరులో 275, కృష్ణాలో 269, తూర్పుగోదావరిలో 227 మందికి వైరస్ సోకింది. మరోవైపు మంగళవారం 2,151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,18,473కి పెరిగింది.
24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురేసి చొప్పున, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6,814కి (Covid Deaths) చేరుకుంది.
ఎంత ఖరీదైన వైద్యం అయినా సరే పేదలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ (YSR Arogyasri) పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ మార్పిడి వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా వర్తింప చేయాలని చెప్పారు. ఆ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అమలు తీరు తెన్నులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.వెయ్యి ఖర్చు దాటే వైద్యం ప్రతి నిరుపేదకు ఉచితంగా అందించే దిశగా అడుగులు వేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు సహా ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఆస్పత్రి పూర్తి ప్రమాణాలు పాటించాలని, ఎన్‌ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్) గుర్తింపు పొందాలన్నారు. ఆరోగ్యశ్రీకి గ్రామాల్లో ఏఎన్‌ఎంలు రిఫరల్ పాయింట్ అని, అందువల్ల వారికి తగిన శిక్షణ ఇచ్చి.. వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు.