Amaravati, Nov 10: ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు వర్తింపచేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ (YSR Aarogyasri) అమల్లోకి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను (Dr YSR Aarogyasri Health Plan) ఆయన ప్రారంభించారు. ఇకపై క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటివరకు 7 జిల్లాల్లోనే అమలైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితాకు అదనంగా మరో 234 వ్యాధులను కూడా ప్రభుత్వం చేర్చింది. ఆసుపత్రుల్లో రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ (Aarogyasri) వర్తింపజేస్తారు. బిల్లు రూ.1000 దాటితే మిగతా బిల్లును ప్రభుత్వమే చెల్లించనుంది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని నేడు సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి.
ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం, ఆరోగ్య శ్రీపై జగన్ కీలక నిర్ణయాలు ఇవే
వైఎస్సార్ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను పట్టణ ప్రాంతంలోని వాటిని మినహాయిస్తే 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తొలి బోరు తవ్వకం కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జలకళ పథకం అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకంలో ఉచిత బోరుతో పాటు మోటార్ లేదా పంపుసెట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వడం ద్వారా ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకరావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.