Tirumala, Mar 11: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
ఇక టీటీడీ ఉద్యోగులకు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మరో తీపి కబురు తెలిపారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిప్ట్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపారు. రూ. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూతకు ఆమోదించారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్ మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు చెయ్యాలని ఆమోదం తెలిపింది. ఇటీవల ఘాట్ రోడ్డులో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానాయన మంత్రిత్వశాఖ తెలిపిందని భూమన చెప్పారు.