Tirumala, January 19: తిరుమలను సందర్శించుకున్న ఎవరైనా... శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara) లడ్డును తీసుకోకుండా వెనుతిరగరు. భక్తులకు ఇప్పుడీ లడ్డు మరింత చేరువైంది. ఇప్పటివరకు లడ్డూలను రాయితీపై కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక అలా అవసరం లేదు. రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) స్వస్తి పలకనుంది.
లడ్డు ప్రసాదంలో నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక్క లడ్డు(TTD Free Laddu) మాత్రమే అందిస్తామని, అదనపు లడ్డు కోసం రూ.50 చొప్పున చెల్లించాలని వివరించారు.
మీనాక్షి ఆలయంలో భక్తులకు ఉచితంగా లడ్డులు
రోజుకు 4 లక్షల లడ్డులు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు కావాల్సినన్ని లడ్డులు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేయనున్నారు.
జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు
ప్రస్తుతం రోజుకు 20వేల లడ్డులను టీటీడీ అందిస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతీ భక్తుడికీ ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇకపై రోజుకు 80వేల లడ్డులను భక్తులకు అందించనుంది.
ఇప్పటిదాకా దివ్య దర్శనం, టైంస్లాట్, సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు రెండు లడ్డులు రూ. 10, మరో రెండు రూ. 25 ధరతో మొత్తంగా రూ. 70కి నాలుగు లడ్డులు అందిస్తోంది. టీటీడీ ఉద్యోగులకు రూ. 5 చొప్పున విక్రయిస్తోంది. రూ. 300 టిక్కెట్‌పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, విశేష ఆర్జిత సేవలకు వచ్చి దర్శించుకునేవారికి రెండేసి లడ్డులను ఉచితంగా ఇస్తోంది.
శ్రీవారి లడ్డులకు బార్ కోడ్, ఇకపై అక్రమాలకు అడ్డుకట్ట
కాగా, ఒక్కో లడ్డు తయారీకి సుమారు రూ. 40 ఖర్చవుతోందని టీటీడీ చెబుతోంది. ఇందు కోసం రూ. 580 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రసాదంపై రాయితీ వల్ల ఏటా దాదాపు రూ. 250 కోట్లకుపైగా భారం పడుతోందని టీటీడీ తేల్చింది. ఈ క్రమంలోనే రాయితీలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఇక కళ్యాణం పెద్ద లడ్డును సామాన్య భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,(TTD Chairman YV Subba Reddy) సభ్యులు ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలిసింది.