Tirumala, Feb 17: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ వివరాలు తెలిపారు.
తిరుమల కొండపై ప్రైవేట్ హోటల్స్ ( private hotels) గురించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ (TTD) పాలకమండలి. త్వరలోనే కొండపై ప్రైవేటు హోటళ్లను తొలగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు మీటింగ్(TTD Board) లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లు తొలగించాలని, తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు.
సీఎం అయినా, సామాన్య భక్తుడైనా టీటీడీ అన్న ప్రసాదం తినాల్సిందేనని స్పష్టం చేసింది. శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి(Bangaru vakili), ఆనంద నిలయాలకు బంగారు తాపడం పనులు చేయించాలని, అన్నమయ్య మార్గం రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు.
ఇక తిరుపతి అలిపిరి(Alipiri) వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో (Tirupati ) నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆర్జిత సేవా టికెట్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను భారీగా పెంచింది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను ప్రారంభిస్తూనే.. టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. సాధారణంగా సుప్రభాత సేవకు 120 రూపాయలు, సిఫార్సు లేఖపై 240 ఉండగా.. దాన్ని రెండు వేల రూపాయలకు పెంచింది.
అలాగే తోమాల అర్చన సేవకు కూడా సాధారణంగా 220, సిఫార్సు లేఖపై 440 ఉన్న ధరను ఐదు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. అలాగే కళ్యాణోత్సవం, వేద ఆశీర్వచనం టికెట్ ధరలను భారీగా పెంచేందుకు సమాయత్తమైంది. కళ్యాణోత్సవం సేవ టికెట్ ధర గతంలో వెయ్యి రూపాయలు ఉండగా.. రెండు వేల ఐదు వందలకు, మూడు వేలు ఉన్న వేద ఆశీర్వచనం టికెట్ ధరను 10 వేలకు పెంచింది. ఇక వస్త్రాలంకరణ సేవ టికెట్ ధరను 50 వేల నుంచి ఏకంగా లక్ష రూపాయలకు పెంచింది టీటీడీ.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ పద్మావతి హృదయాలయంకు అవసరమైన వైద్య పరికరాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని పాలకమండలి ఏర్పాటు చేసిందన్నారు.
పద్మావతి హృదయాలయం ప్రారంభించి 100 రోజులలో 100 అపరేషన్లు నిర్వహించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.
రూ.2.73 కోట్లతో స్విమ్స్‌కు కంప్యూటర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంను బాలాజి జిల్లా కలెక్టరెట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి నిబంధనల మేరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నారు