Vaikunta Dwara Darshanam: వైకుంఠ దర్శనం రెండు రోజులే, ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ, వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన కలియుగ వైకుంఠం
two-days-vaikunta-dwara-darshanam-tirumala-says-yv-subba-reddy (Photo-Twitter)

Tirumala, January 06: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో (High Court) నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ (TTD Board) బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Y V Subba Reddy) మాట్లాడుతూ, ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, గతంలో మాదిరి రెండు రోజులు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టు సూచనల మేరకు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఉత్తర ద్వారాలు పది రోజులు తెరవడంపై కమిటీ నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది దీనిని అమలు చెయ్యాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారని, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుకుండా ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.

వైకుంఠ ఏకాదశిని (Vaikuntha Ekadashi)పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 12టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళభరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్‌ వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి.

వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠం కాంప్లెక్స్‌, నారాయణగిరి ఉద్యానవనం సహా నాలుగు మాడ వీదుల్లో 90 వేలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది.

ఈ సందర్భంగా వీవీఐపీల దర్శనానంతరం సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. ధనుర్మాసకైంకర్యాల అనంతరం తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు ఈ నెల 8వరకు అదే ద్వారా గుండా భక్తులను అనుమతించనున్నారు. కాగా స్వామి వారి సర్వదర్శనం మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో తిప్పనున్నట్లు టీటీడీ ప్రకటించింది.