Dharmavaram, Dec 23: అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలో స్నేహితులతో కలిసి ప్రియురాలిని ప్రియుడు దారుణంగా హత్య (Dharmavaram Murder Case) చేసిన సంగతి విదితమే. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే ఆ యువతిపై అత్యాచారం జరిగిందనే వార్తల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్నేహలతపై రేప్ జరగలేదని, ప్రేమికుల మధ్య విభేదాలే (love affair) హత్యకు కారణమని తెలిపారు. ప్రవీణ్ అనే మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో నిందితులు హత్యకు పాల్పడ్డారని అన్నారు.
ప్రియుడు రాజేష్, ఇతర నిందితులపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదని, ఫిర్యాదు రాగానే మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. స్నేహలత కేసును దిశ పీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరగా ఛార్జిషీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాంట్రాక్టు ఉద్యోగిని. యథావిధిగానే మంగళవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.