Nellore, Sep 18: చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు రావాలంటూ నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) 37వేల లడ్డూలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆ లడ్డులను ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గంలోని వినాయకుని విగ్రహాల వద్దకు చేర్చి అక్కడ పంపిణీ చేయనున్నారు.
త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ... ఆ గణనాథుడి ఆశీస్సులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సచ్ఛీలుడిగా బయటకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని తాను ప్రార్థిస్తున్నానన్నారు.
వైసీపీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిందని, కాబట్టి త్వరలో టీడీపీలో చేరుతానని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే ఇప్పటికే చేరిక పూర్తయి ఉండేదన్నారు. టీడీపీ నుంచి సమాధానం వచ్చాక, చంద్రబాబు బయటకు వచ్చాక తాను ఆ పార్టీలో చేరుతానన్నారు.
తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినప్పటికీ తన గ్రాఫ్ బాగాలేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను తప్ప ఎవరూ గెలవలేరన్నారు. టీడీపీలో చేరాక, పార్టీ అధినేత టిక్కెట్ ఇస్తే తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఏపీలో ప్రస్తుత పాలనలో ధర్మం, న్యాయం లేదని ప్రజలకు అర్థమైందని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అవి సాధ్యమన్నారు.