
Tirupathi, Mar 1: మార్చి 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతిలో జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినా, తాజాగా ఆయన పర్యటన (Amit Shah Tirupathi Tour Cancelled) రద్దయింది. తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా వెల్లడించారు.
అయితే, ఆయన పర్యటన (Amit Shah Tirupathi tour) ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. తిరుపతిలో జరిగే సమావేశానికి ఏపీతో పాటు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు, లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.
కాగా, దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాంతో, అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రాబోవడంలేదని సమాచారం.
ఇక ఈ నెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపతిలో జరగాల్సిన సమావేశం అమిత్ షా హజారుకాకపోవడంతో వాయిదా పడింది. సదరు మీటింగ్‌కు సంబంధించి తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే సమాచారం కూడా వెళ్లింది. కానీ, సడెన్‌గా అమిత్‌షా పర్యటన రద్దైనట్టు. ముఖ్యమంత్రుల సమావేశం క్యాన్సిల్ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ముఖ్యమంత్రులతో మీటింగ్ ఎప్పుడు జరిగేదీ తర్వాత ప్రకటిస్తారు.
ఇక తిరుపతిలో బైపోల్ ఉన్న నేపథ్యంలో అమిత్ షా రాకపై బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అమిత్ షా వస్తే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని తద్వారా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పుంజుకుంటుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.