Srisailam, August 12: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం వీచ్చేశారు, ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలోని భ్రమరాంభ సమేత శ్రీమల్లిఖార్జున స్వామిని దర్శించుకొని మల్లిఖార్జునుడు, పార్వతీదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంభ అతిథి గృహంలో మధ్యాహ్న భోజనం చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం 3:50 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లి అక్కడ్నించి దిల్లీ వెళ్లిపోనున్నారు.
గురువారం ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా, అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కోటేశ్వరరావు తదితరులు అమిత్ షాకు సాదరస్వాగతం పలికారు. అక్కడ్నించి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్న ఆయనకు ఆలయం మహాద్వారం వద్ద పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఏపి పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.