G Kishan Reddy (Photo Credits: ANI)

Tirupati, August 19:  కేంద్రంలో బీజేపీ ఏడేళ్ల  పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుంచి 'జన్ ఆశీర్వాద యాత్ర'ను ప్రారంభించిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి గురువారం తిరుమల ఏడుకొండల స్వామి వారిని దర్శించుకున్నారు. టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం కేంద్రమంత్రి వేద పండితులు ఆశీర్వచనం పొంది స్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను స్వీకరించారు. కిషన్ రెడ్డితో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నారాయణస్వామి తదితర ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర పథకాల అమలు మినహా ఏపిలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని అన్నారు. ఏపికి కేంద్రం అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అభివృద్ధి చేసిందని కిషన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రం అందించాల్సిన వాటా నిధులు లేక మరికొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపిందని గుర్తుచేశారు.

ఏపి- టీఎస్ మధ్య జల వివాదాలను ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలనేదే కేంద్ర భావన అని యూనియన్ కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తిరుపతిలో తన పర్యటన సందర్భంగా స్థానిక స్విమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ సెంటర్ ను పరిశీలించి, అక్కడి నర్సుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తాం. పర్యవేక్షణ కమిటీ నేతృత్వంలో రోజువారీగా సమీక్షలు చేసి రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నామని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కూడా ఉండాలని తెలిపారు. వచ్చే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 'దేఖో అప్నా దేశ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

బీజేపి జన ఆశీర్వాద యాత్ర కోసం ఏపిలో ముందుగా రెండు పార్లమెంటరీ స్థానాలైన తిరుపతి, విజయవాడలను ఎంచుకున్నారు. ఇక్కడ రెండు రోజుల పర్యటన తర్వాత ఈ యాత్రను తెలంగాణలో కొనసాగించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మంత్రి కిషన్ రెడ్డి గురువారం తిరుపతి నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారు. తర్వాత విమానాశ్రయం నుండి బిజెపి ఏర్పాటు చేసిన వేదిక వరకు మోటార్ సైకిళ్లు మరియు కార్లతో భారీ ర్యాలీ జరుగుతుంది. అనంతరం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం తెలంగాణలో యాత్ర కొనసాగిస్తారు.