Visakhapatnam, July 7: విశాఖపట్నంలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో సూరిబాబు అరెస్ట్ అయ్యారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్ నేవల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్ ఆర్‌ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు హోంగార్డులు శ్యామ్‌సుందర్ అలియాస్ మెహర్, శ్రీనుపైనా కేసు నమోదు చేశారు. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా వ్యవహించిన సూరిబాబుపైనా ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బాధితుల నుంచి క్యాష్ కొట్టేయడంలో కానిస్టేబుల్, హోంగార్డ్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఒక పథకం ప్రకారం ఈ దాందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డీజీపీ సీరియస్ అయ్యారు. కాగా నగదు మార్పిడికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబు బాధితులను బెదిరించి రూ. 5 లక్షలు కొట్టేసాడు. అలాగే కారులో ఉన్నరూ. 12 లక్షల బ్యాగుతో పరార్ అయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్‌లు సూరిబాబును అడ్డుకున్నారు. దీంతో తనపై దాడి చేస్తున్నారంటూ ముగ్గురి వ్యక్తులకు ఫోన్ చేసి సూరిబాబు పిలిచించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించారు.
ఈ విషయంపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు రుజువు కావడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.