Visakha, Nov 20: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్‌ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ఏకంగా 50 నుంచి 60 బోట్ల వరకు దగ్ధమైనట్టు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో.. కీలక నిందితునిగా భావిస్తోన్న ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి లోకల్ బాయ్ నానీనే కారణమని.. సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
నిన్న (నవంబర్ 19న) సాయంత్రం లోకల్ బాయ్ నాని భార్య శ్రీమంతం కార్యక్రమం జరగగా.. రాత్రి సమయంలో తన స్నేహితులకు బోటులో మద్యం పార్టీ ఇచ్చారు. అయితే.. ఆ పార్టీ తర్వాతే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అందులోనూ.. ఈ ప్రమాదాన్ని లోకల్ బాయ్ నాని.. మొత్తం వీడియో తీసి.. తన యూట్యూబ్ ఛానల్‌లో ఆప్ లోడ్ కూడా చేశాడు. దీంతో.. ఇది సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.
వీడియో వైరల్ అవుతుండటంతో పాటు లోకల్ బాయ్ నానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం నానినే అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే.. స్నేహితులతో కలిసి బోటులో పార్టీ చేసుకుంటున్న సమయంలో.. వంట చేసుకుంటుండగా మంటలు అంటుకున్నాయని.. ఇది గమనించిన ఇతర మత్స్యకారులు, లంగర్ వేసిన బోటును వదిలారు. మంటలు అంటుకున్న బోటు జట్టి నెంబర్ 1లో ఉన్న పడవల వద్దకు చేరుకోగా.. అందులో ఉన్న సిలిండర్ పేలి మంటలు మిగతా బోట్లకు కూడా వ్యాపించాయిని.. దీంతో ప్రమాదం మరింత పెద్దగా మారిందని చెప్తున్నారు.