Vizag Crane Crash Incident: విశాఖ షిప్‌ యార్డు ప్రమాదంపై నివేదికను కలెక్టర్‌కు అందజేసిన కమిటీ, నిర్ణీత సామర్థ్యానికి తగినట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని నివేదికలో వెల్లడి
Visakhapatnam Crane Crash | (Photo Twitter)

Visakhapatnam, August 12: ఆగస్టు 1వ తేదీన విశాఖ పట్నంలో హిందూస్థాన్ షిప్ ‌యార్డులో క్రేన్ ప్రమాదం (Vizag Crane Crash Incident) జరిగి పదిమంది కార్మికులు మృతి చెందిన సంగతి విదితమే. దీనిపై ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ( Six Members Committee) వేసి తక్షణమే నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రమాదంపై (Visakhapatnam shipyard crane accident) నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు (Collector Vinay Chand) కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగినట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం నివేదికలో పొందుపరిచింది.

షిప్ యార్డ్‌కు అనుపమ క్రేన్ ఇంజనీరింగ్ సంస్థ క్రేన్‌ సమకూర్చినట్లు తెలిపింది. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా క్రేన్‌ కుప్ప​కూలిపోవడంతో విశాఖలో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాల తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు.

హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల సహాయం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది.