Vishakhapatnam, July 8: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో (Vizag Gas Leak) మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో (LG Polymers CEO) సున్‌కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం
ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) వివిధ రంగాల ఉన్నత స్థాయి నిపుణులతో హైపవర్ కమిటీని నియమించిందని, ఆ కమిటీ సోమవారం తన నివేదికను అందజేసిందని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా గుర్తుచేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఏమైనా కొత్త విషయాలు వెలుగుచూసినా, ఇంకా బాధ్యులను గుర్తించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది.
ఈ దుర్ఘటనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. పరిశ్రమలో ప్రమాదం జరగకుండా తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో ఉదాసీనంగా వ్యవహరించారనే అభియోగంపై డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కేబీఎస్ ప్రసాద్‌తోపాటు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రాంతీయ అధికారి పి.ప్రసాదరావు, గతంలో అదే హోదాలో పనిచేసిన ఆర్.లక్ష్మీనారాయణపై వేటు వేసిందని తెలిపారు. ఎం-6 ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగడం, సేఫ్టీ ప్రొటోకాల్ సక్రమంగా పాటించకపోవడం, సేఫ్టీపై అవగాహన సరిగా లేకపోవడం, యాజమాన్యం ఉదాసీనత, లోపభూయిష్టమైన నిర్వహణ ప్రమాదానికి కారణాలుగా కమిటీ తన నివేదికలో పేర్కొందని చెప్పారు.