Amaravati, Jan 9: చలి పులి పంజాకు ఏపీ రాష్ట్రం గజగజా (Cold wave sweeps Andhra Pradesh) వణికిపోతోంది. చలిగాలుల ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు (mercury drops below 3 degrees) తగ్గాయి.అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లితో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు.
అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్‌వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.