Representational Image | (Photo Credits: PTI)

ఏపీలో మరో మూడు రోజుల పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది.

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (IMD predicts light to moderate rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది.అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.

బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఏడుగురు గల్లంతు, ఇద్దరు మృతి, గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్‌ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.