Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక
Rains (Photo-Twitter)

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురును వాతావరణ శాఖ అందించింది.ముఖ్యంగా ఏపీలో మళ్లీ వానలు భారీగా కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 20వ తేది అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 20, 21 తేదీల్లో మధ్య అల్పపీడనం వాయుగుండంగా మారనుందని అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి.. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 22వ తేదీ కల్లా వాయుగుండంగా.. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడనుందని భావిస్తున్నారు.

తేజ్ తుఫానుపై ఐఎండీ భారీ హెచ్చరిక, అరేబియా సముద్రంలో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటంటే..

ఈనెల 25 కల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా తీరాల దిశగా వచ్చి తుఫాన్‌గా మారుతుందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే కోస్తా ప్రాంతంపై తుఫాన్ ప్రభావం చూపుతుందని.. అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇక నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్కృమించిన నేపథ్యంలో, 22వ తేది నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే పరిస్థితులు నెలకొన్నట్లు అంచనా వేశారు. ఈ రుతుపవనాల ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని, ఈరోజుల్లో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఇదిలా ఉండగా, 22వ తేది నుంచి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముందని, తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాలు సహా డెల్టా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

అరేబియా సముద్రంలో దూసుకొస్తున్న తేజ్ తుఫాన్...గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం..

ఇక అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను కారణంగా మహారాష్ట్ర నగరంలో వాతావరణ మార్పుల గురించి భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది .రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వాతావరణ నవీకరణ సోమవారం వెల్లడించింది.

వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుఫానుల అభివృద్ధికి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైన కాలాలలో ఒకటి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేయడానికి అనుసరించిన సూత్రం ప్రకారం, భారత సముద్రాలలో ఉష్ణమండల తుఫాను ఏర్పడినట్లయితే దానిని "తేజ్" అని పిలుస్తారు.