Rainfall (Photo Credits: IANS|File)

వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (heavy rain for next two days) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్‌ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.

గులాబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి.