Amaravati, Dec 8: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు (Somu Veerraju) రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్నారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు (Andhra Pradesh BJP chief Somu Veerraju) మాట్లాడుతూ.. ‘‘42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏపీలో బీజేపీ (BJP) మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేదు’’ అన్నారు.
2014 ఎన్నికల సమయంలోనే నాకు రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను ఇష్టపడకపోతేనే ఆకుల సత్యనారాయణకి అవకాశం దక్కింది. నేను బీజేపీ కార్యకర్తని... పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాను. డిసెంబర్ మూడున ‘దివ్య కాశీ.. భవ్య కాశీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాశీ క్షేత్రం రూపురేఖలను ప్రధాని మోదీ పూర్తిగా మార్చారు.. కాశీ క్షేత్రం అభివృద్ది కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్శిస్తాం’’ అని తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ.. విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని డెయిరీలు, చక్కెర మిల్లులను మూసేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు.
పాయకరావుపేట చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే విక్రయానికి సిద్ధం చేసిందని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూసేస్తున్నారని కేంద్రంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు భాజపా మద్దతు ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.