Amaravathi, September 3: ఈ సెప్టెంబర్ నెలలో 3.5 కోట్ల కొవాగ్జిన్ డోసుల్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ ఇచ్చేందుకు సంబంధించిన 2, 3వ దశ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ప్రతిరోజూ రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ రోజుకి సుమారుగా 15 వందల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే నమోదయ్యే కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా ఆక్టివ్ కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతూ మళ్లీ 15 వేలకు చేరువకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో రాబోయే రోజుల్లో వరుసగా వచ్చే పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరికొంత కాలం ఇలాగే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతోంది. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 64,739 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,18,200కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,15,305 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి 263, చిత్తూరు జిల్లా నుంచి 188, నెల్లూరు నుంచి 186 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,887కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,290 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,89,391 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,922 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.