Amaravathi, September 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే రోజూవారీ కోవిడ్ కేసులు సుమారు రెండు వేల మేర పెరిగాయి. అయితే అందుకు తగినట్లుగా రికవరీల సంఖ్య పెరగటం లేదు, దీంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తూ మళ్లీ 15 వేల మార్కును దాటాయి.
ఆగష్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇక, ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,911 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,27,650కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,24,755 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు నుంచి 281, నెల్లూరు నుంచి 261 మరియు తూర్పు గోదావరి జిల్లా నుంచి 213 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,970కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,107 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,98,561 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 15,119 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.