COVID in AP | (Photo-PTI)

Amaravathi, April 8: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారుగా 2 వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ పైనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే కోటి వ్యాక్సిన్ డోసులు అదనంగా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా అందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

గురువారం సాయంత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరియు కోవిడ్ నివారణ చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,268 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2558 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,15,832 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,12,937గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 465 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి నుంచి 399 కేసులు,  కర్నూలు నుంచి 344, విశాఖపట్నం నుంచి 290, మరియు నెల్లూరు నుంచి 204 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,268కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 915 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,93,651 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,913 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.