Moka Bhaskar Rao Assassination: వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య, సైనేడ్‌ పూసిన కత్తితో మోకా భాస్కర్‌ రావును హత్యచేసిన దుండుగులు, మచిలీపట్నంలో 144 సెక్షన్
representational image (photo-PTI)

Amaravati,June 29: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో (Machilipatnam) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌ రావు (YCP Leader Moka Bhaskar Rao) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న ఆయనను కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య (Moka Bhaskar Rao Assassination) చేశారు.

ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు (Bhaskar Rao Family) ఆరోపిస్తున్నారు.

భాస్కరరావు హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. భాస్కర్ రావును హత్య చేసిన తర్వాత బైక్‌పై పరారవుతున్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. భాస్కరరావును పొడిచిన అనంతరం రోడ్డుపై అప్పటికే సిద్ధంగా ఉంచిన బైక్ ఎక్కి ఒకరు పరారయ్యారు.

చిన్ని అనే వ్యక్తి ఈ హత్యకు కుట్రదారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు. భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశారు. భాస్కర్‌ రావు హత్యతో మచిలీపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.