Anakapalli, May 17: నేటి కాలంలో ఉద్యోగం (Job) దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం (Government Job).. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ (Central Govt. Job) అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి (Student) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు. ఏపీకి చెందిన రుత్తల రేవంత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రేవంత్ స్వస్థలం అనకాపల్లి జిల్లా మాకవర పాలెం మండలం. అతడి తండ్రి రుత్తల సత్యనారాయణ వ్యాపారం చేస్తుండగా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.
ఇప్పటికే ఓ ఉద్యోగ శిక్షణలో..
ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణలో ఉన్న రేవంత్‌కు మరో రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు వచ్చాయి. 2021లో అతడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలో అకౌంటెంట్‌గా ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వులు ఎదురు చూస్తూనే ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షకూ హాజరయ్యాడు. ఈ నెల 12న ఫలితాలు విడుదలవగా రేవంత్ 390 మార్కులకు గానూ 332 సాధించాడు. ఫలితంగా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)గా అర్హత సాధించాడు.