Vjy, Jan 11: జగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ( Jagananna Thodu scheme funds) ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు.
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకు పైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో () వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం. కొత్తగా 86 వేల మందికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. రుణాలు తీసుకున్న వారిలో 95 శాతం మంది తిరిగి చెల్లింపులు చేస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు.
జగనన్న తోడు (Jagananna Thodu) ద్వారా 79.174 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి జరిగింది. సామాజిక సాధికారతను ఇది నిదర్శనం. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా నిలిచింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. ప్రతీ అడుగులోనూ పారదర్శకంగా పాలన. చేయి పట్టుకుని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు. ఇంకా మంచి చేసే అవకాశం కలగాలి’ అని ఆకాంక్షించారు.