Supreme Court. (Photo Credits: PTI)

June 19: వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల(జులై) 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశిస్తూనే.. ప్రతివాదులకు సోమవారం నోటీసులూ జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది.

వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ నేడు విచారించింది. గత వాదనల సందర్భంగా సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు బెంచ్‌ నిరాకరించింది. ఇక ఈ పిటిషన్‌లో ప్రతివాదులైన సీబీఐ, అవినాష్‌లకు బెంచ్‌ నోటీసులు జారీ చేసింది.

వివేకా హత్య కేసు, ఆరుగురు నిందితులకు ఈ నెల 30 వరకు రిమాండ్ పొడిగింపు, ఆదేశాలు జారీ చేసిన సీబీఐ కోర్టు

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ సందర్భంగా.. సునీతా రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. జూన్ 30 కల్లా వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు గడువు ముగుస్తోందని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

పైగా గడువులోగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇదివరకే సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించిన విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని సుప్రీం బెంచ్‌ అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో జులై 3న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం ముందు కేసును విచారించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది.