Amaravati, May 5: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో (YSR Jagananna colonies) పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి (Andhra Pradesh CM Y S Jaganmohan Reddy) అన్నారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు. స్టీల్, సిమెంట్..ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు.
జగనన్న కాలనీలకు సంబంధించి (Ysr Housing Scheme) ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని జూన్ 1న పనులు ప్రారంభించాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగాలి. ఇళ్ల నిర్మాణానికి (ysr jagananna housing colonies scheme 2021) నీరు, విద్యుత్ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌజ్ నిర్మించాలి. ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదిక కూడా తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు.. వంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలని సీఎం సమీక్షలో అధికారులకు సూచించారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. కాబట్టి స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలి. అలాగే లేఅవుట్ కూడా పక్కాగా ఉండాలి. సీసీ రోడ్డు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జెజెఎం), విద్యుద్దీకరణ, ఇంటర్నెట్.. మౌలిక వసతుల్లో ముఖ్య కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు, రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్ అన్నది చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. దీన్ని పరిష్కరించాలని అధికారుకు తెలిపారు.
భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థదే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైప్‌లైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. అయితే ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. జగనన్న కాలనీ లేఅవుట్లలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, భూగర్భ ఇంటర్నెట్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పనులు. అయితే ఇవన్నీ వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒకే ఏజెన్సీకి అన్ని పనులు అప్పగించాలి. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించండి. పనుల్లో డూప్లికేషన్ ఉండకూడదు, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించండని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ తెలిపారు.