Amaravati, Nov 1: విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం (YSR Lifetime Achievement Awards) ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించినవారికి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ చేతులమీదుగా ( YS Jagan and governor Biswabhushan Harichandan) అవార్డుల ప్రదానం జరిగింది. మొత్తం 59 అవార్డుల్లో (YSR Awards) 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను అందజేశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందినవారికి 10 లక్షలు, కాంస్య విగ్రహంతో పాటు సర్టిఫికెట్ అలాగే వైఎస్సార్ అచీవ్‌మెంట్ పొందినవారికి 5 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతా పత్రం అందజేశారు.అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు.
సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి’’ అని సీఎం కొనియాడారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1న వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.