Amaravati, Sep 27: ఏపీ ప్రభుత్వం పేదలు తమ ఆడ బిడ్డలకు పెళ్లిళ్లు చేసేందుకు, వారికి అండగా నిలబడేందుకు వైఎస్సార్ పెళ్లికానుక (వైఎస్సార్ కల్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా) పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పిస్తుంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కారు.. అక్టోబర్ నుంచి వైఎస్సార్ పెళ్లి కానుకను రూపకల్పన చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైఎస్సార్ కల్యాణమస్తు, మైనార్టీలకు షాదీ తోఫా పేరుతో శ్రీకారం చుట్టిన ఈ పథకాలను అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో ప్రభుత్వం జీఓ.47ను జారీ చేసింది.
అర్హతలు
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకానికి సంబంధించి అర్హత నిబంధనలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి గ్రామ/వార్డు సచివాయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి ఆర్థికసాయం అందుతుంది. వధువు, వరుడు పదవ తరగతి పూర్తిచేసి ఉండాలి. అలాగే వధువు, వరుడు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. మూడు ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్టభూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండవచ్చు.
సర్కారు అందించే పెళ్లి కానుక ఇలా..
►ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష
►ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు
►బీసీలకు రూ.50 వేలు
►కులాంతర వివాహాలకు రూ.75వేలు
►మైనార్టీలకు రూ.లక్ష
►దివ్యాంగులకు రూ.1.50 లక్షలు
►భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు