Amaravati, April 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు.
ఏపీ గురించి కేటీఆర్ ప్రత్యక్షంగా ఏమీ చూడకుండానే ఆయన స్నేహితుడు చెప్పిన మాటలు నిజమని నమ్మి ఆయన వ్యాఖ్యలు చేశారన్న బొత్స (YSRCP Minister Botsa Satyanarayana) తెలంగాణలో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినా తాను ఎవరికి చెప్పుకోవడం లేదు కదా అంటూ స్పందించారు. తమ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవచ్చు గానీ పొరుగు రాష్ట్రాలను విమర్శించరాదంటూ బొత్స అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ "ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవరో స్నేహితుడు ఫోన్ చేశాడేమో.
నేను నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్నా. కరెంట్ లేక జనరేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఇది నేనెవరితోనూ చెప్పలేదు కదా. కేటీఆర్ మాటలను (KTR Controversial Comments) నేను ఆక్షేపిస్తున్నాను. బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడకూడదు. మీ దగ్గర జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాలను విమర్శించవద్దు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి" అని బొత్స వ్యాఖ్యానించారు.
మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సందర్భంగా KTR మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో కరెంటు, నీళ్లు ఇతర వసతులు లేవని (Andhra Pradesh Power Cut and Roads ) ఈ సందర్భాంగా కేటీఆర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు.
వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు…నాలుగు రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నేను చెప్పడం కాదు…మీరు కూడా ఒక సారి ఏపీ వెళ్లి చూసి రండన్నారన్నారు.