YSRCP MLAs Vs Chandrababu (Photo-File Image)

Vjy, Oct 31: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు నిజం గెలిచిందంటూ సంబరాలు చేసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ దాడికి దిగారు.

అంబటి రాంబాబు : స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారని, దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని తెలిపారు.

45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, మీరు చూపిన అభిమానం మరువలేనని తెలిపిన చంద్రబాబు

బాబుకు కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్‌ ఇచ్చారన్న అంబటి.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. నిజం ఇంకా గెలవలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

వీడియో ఇదిగో, 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదని అన్నారు అంబటి రాంబాబు. కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయిందన్నారు. ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని తెలిపారు. వచ్చే ఎన్నికల ముందో, తర్వాతో ఏపీలో కూడా జెండా పీకేస్తారని విమర్శించారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు : రోగాలు ఉన్నందుకే చంద్రబాబుకు స్కిల్‌ స్కాం కేసులో కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని, ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటూనే టీడీపీ అధికార ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి పని చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బెయిల్‌ పరిణామంపై విజయవాడలో మంగళవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు.

‘‘కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నాయనే. చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు. అనారోగ్యాలతో బెయిల్‌ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ చంద్రబాబుకి ఉన్నట్లు చూపించి బెయిల్‌ తెచ్చుకున్నారు. చంద్రబాబుకి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్‌ మాత్రమే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే’’ అని వెల్లంపల్లి అన్నారు.

మనవడు దేవాన్ష్‌ను చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు, దగ్గరకు తీసుకుని బుగ్గలు చిదుముతూ ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్

చంద్రబాబు కనీసం 50 రోజులు కూడా సక్రమంగా లేరని.. ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు. తెలంగాణ ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్‌ను మోసం చేసారు. కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు. బీసీలను చంద్రబాబు మరోసారి మోసం చేశారు’’ అని వెల్లంపల్లి విమర్శించారు.

ఇప్పుడు తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా పార్టీ జెండా పీకేసిన చంద్రబాబు.. 2024లో ఏపీలోనూ అదే పని చేస్తారన్నారు. పవన్ టీడీపీతో కలిసినా ఏపీలో ప్రయోజనం లేదన్నారు. ‘‘తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్లు?. విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చు కదా?. ఎందుకు వెళ్ళలేదు?’ అని వెల్లంపల్లి ప్రశ్నించారు. లోకేష్ అసమర్ధుడని టీడీపీ క్యాడర్ భావిస్తుందన్నారాయన.

ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అవినీతిలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా వాటా ఉంది. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ.. టీడీపీకి అధికార ప్రతినిధిగా పురందేశ్వరి కొనసాగుతున్నారు. అమిత్ షా వద్దకు లోకేష్‌ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడానికే పురందేశ్వరి కంకణం కట్టుకున్నారని.. చంద్రబాబును జైలు నుంచి బయటకు తేవాలి, సీఎంను చేయాలన్నదే పురందేశ్వరి లక్ష్యం అని వెల్లంపల్లి ఆరోపించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి: చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్ధం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు.

'బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు? ఇది విజయోత్సవాలు జరపాల్సిన సందర్భమేనా?. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా లేదు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు విప్లవకారుడా..? స్వాతంత్ర్య ఉద్యమకారుడా?. అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. పేదలకు మంచి చేసి ఉంటే చంద్రబాబు కోసం కన్నీళ్లు కారుస్తారు. చంద్రబాబు జైలుకెళితే ఎవరూ బాధపడలేదు.' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారని సజ్జల దుయ్యబట్టారు. స్కిల్ కేసులో డబ్బులు షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా అని ప్రశ్నించారు. సానుభూతి కోసం బెయిల్ తెచ్చుకుని.. జనాలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.