Srisailam Dam | Photo: Twitter

Srisailam, July 29: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,60,154 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం1632.62 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఏంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 99.624 టీఎంసీలుగా ఉంది. ఈ క్రమంలో అధికారులు పది గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో నిన్నటి నుంచే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తడం ప్రారంభించారు. ఎగువన ప్రవాహం నిలకడగా బుధవారం 2 గేట్లు తెరచి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు, ఈరోజు పూర్తి స్థాయిలో 10 గేట్లను ఎత్తివేశారు. ఇలా ఒకేసారి 10 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పోటేత్తుతోంది. ఈ నేపథ్యంలో పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కృష్ణా నది వరద ప్రవాహం తుంగభద్ర జలాశయానికి కొనసాగుతుంది. నదీ జలాలు హంద్రీనీవా ద్వారా రాగులపాడు పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ నీటిని ఒక మోటారుతో ఎత్తిపోస్తున్నారు. సాయంత్రానికి జీడిపల్లి జలాశయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

2007 తర్వాత శ్రీశైలం గేట్లు జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఈ ఆహ్లదకర దృశ్యాన్ని సందర్శించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

Watch Video:

ఈ వార్త ఇలా ఉంటే, శ్రీవారి సందర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్ల కోటాను టిటిడి తిరిగి పెంచింది. కరోనావైరస్ రెండవ-వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుండి దర్శనాల సంఖ్యను  గణనీయంగా తగ్గించిన దేవస్థాన బోర్డ్, అప్పట్నించీ కేవలం 5 వేల టికెట్లు టికెట్లు కేటాయిస్తోంది. ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను అదనంగా రోజుకు 3 వేలు పెంచింది. ఈ నెల 28 నుండి ఆగస్టు 31 వరకు రోజుకు మూడు వేల టికెట్ల పెరుగుదలతో దాదాపు పది లక్షల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.