New Delhi, July 16: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ చోటుచేసుకుంటున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల పరిధిలోకి రానున్నాయి. వీటిపై పూర్తి పెత్తనం, నిర్ణయాధికారం బోర్డుకే ఉంటుంది, ప్రాజెక్టుల నీటి పంపకాలు, విద్యుదుత్పత్తి బోర్డులే చూసుకుంటాయి. అలాగే బోర్డు నిర్వహణ ఖర్చులన్నీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ అమౌంట్ కింద డిపాజిట్ చేయాలని పేర్కొంది.
ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి... 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
ఇక, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, నాగార్జునసాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టుల్లో తదుపరి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ జెన్‌కో అధికారులకు సూచించింది. ఆయా ప్రాజెక్టుల నుంచి సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినందువల్ల బోర్డు ఆదేశాలను పాటించాలని తెలిపింది.
కాగా, ఈ గెజెట్ విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి అధికారులు మాట్లాడారు, ఎంతో చర్చించిన తర్వాతనే బోర్డుల పరిధిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలు, అవసరాల మేరకు నీటి కేటాయింపులు ఉంటాయి. ట్రిబ్యునల్ ప్రకారమే నీటి పంపకాలు ఉంటాయని అధికారులు తెలిపారు.