AP Ex-Ranji Cricketer Held: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ రూ. 40 లక్షలకు టోకరా, ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Representational Image | Photo: Pixabay

Hyderabad, March 6: తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.టి.రామారావు వ్యక్తిగత సహాయకుగా చెప్పుకుంటూ డబ్బులు దోచుకుంటున్న వ్యక్తిని హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా, యవ్వారిపేటకు చెందిన నాగరాజు పలు కార్పోరేట్ ఆసుపత్రులకు, వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి తనని తాను కేటీఆర్ పీఏగా పరిచయం చేసుకుంటూ వారిని డబ్బులకు డిమాండ్ చేస్తున్నాడు.

వివిధ కంపెనీలు మరియు కార్పోరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వెబ్‌సైట్లలో ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా వారి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి ప్రభుత్వ టెండర్లకు ప్రతిపాదనలు చేస్తున్నాడు. ఇలా ఎల్‌బి స్టేడియంలో కంపెనీలకు సంబంధించిన హోర్డింగ్‌లు పెట్టడానికి మంత్రి నుంచి ప్రపోజల్ ఉందని నమ్మించి సుమారు 9 కంపెనీల నుంచి రూ. 39.22 లక్షల వరకు నాగరాజు వసూలు చేశాడు. అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాగరాజును వల పన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సుమారు రూ. 10 లక్షలు రికవరీ చేయగలిగినట్లు పోలీసులు తెలిపారు.

నాగరాజుపై గతంలో కూడా 10 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా నాగరాజు 2014-16 మధ్య ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ క్రికెటర్‌గా కూడా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు.