Hyderabad, September 10: హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని అనేక దేవాలయాలలో హోమాలు మరియు పూజలతో వినాయక చవితి పండుగ ప్రారంభమైంది. భాద్రపద మాసం చతుర్ది నాడు, శుక్రవారం ప్రారంభమైన ఈ వినాయక చవితి ఉత్సవాలు 10 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. గతేడాది, లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు ఈ ఏడాది మాత్రం కోవిడ్ నిబంధనల మధ్య వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్ కాలనీలు, కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అందంగా అలంకరించిన పండళ్లలో గణనాథుడి విగ్రహాలు కొలువుదీరాయి. వందలాది మంది భక్తులు ఉదయాన్నే దేవాలయాలు మరియు పండళ్ల మధ్య పూజలు చేస్తూ కనిపించారు.
ఇక, ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి (బడా గణేష్) భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా స్వామి దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మహా గణపతి 36 అడుగులు ఎత్తు ఉండగా, తలపై ఉన్న సర్పంతో కలుపుకొని 40 అడుగుల ఎత్తు ఉంటుంది. మహా గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు, ఖైరతాబాద్ పరిసరాలన్నీ కోలాహలంగా మారిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఖైరతాబాద్ మార్గంలో ఈ నెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి.
Watch this video:
ఖైరతాబాద్ గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం తొలిపూజ నిర్వహించారు. ఈ తొలిపూజ కార్యక్రమంలో హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుడా పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పండగ శుభాకాంక్షలు తెలిపారు.