Hyderabad, July 22: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు పలు జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది, జలాశయాలు నిండి ఇన్ ఫ్లో ఎక్కువయింది. రాబోయే రెండు రోజుల వరకు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనావేసింది.
చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మరియు వాయువ్య బంగాళాఖాతంలో ట్రోపోస్పిరిక్ స్థాయిలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణపై దీని ప్రభావం భారీగా, దక్షిణ తెలంగాణపై మితంగా ఉంటుందని తెలిపింది.
ఈరోజు నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మరియు భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలలో భారీ నుంచి భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ బులెటిన్ అంచనా వేసింది, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మిగిలన ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలెర్డ్ జారీ చేసింది.
కాగా, హైదరాబాద్ పరిధిలో మితమైన నుండి భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజుల వరకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
గురు, శుక్ర వారాల్లో ఏపీలోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షపాతం నమోదవొచ్చని తెలిపారు.