Heatwave | Image Used For Representational Purposes (Photo Credits: JBER)

Hyderabad, April 2: ఏప్రిల్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతున్నాడు. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది.

తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం ఉండడం వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది, అలాగే రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య మరియు తూర్పు భాగాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండి డైరెక్టర్ కె. నాగరత్న పేర్కొన్నారు.

శుక్ర, శని వారాల్లో దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు మరియు ఉత్తర భాగంలో సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని ఆయన అంచనా వేశారు.

గురువారం నాడు భద్రాచలం వద్ద గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సూర్యపేటమరియు నల్గొండలో 42 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వరంగల్, పెద్దపల్లి మరియు కరీంనగర్ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రత 39 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది.

హైదరాబాద్‌లో గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని, మే నెల వచ్చే సరికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని వాతావరణ సంస్థ అంచనా వేసింది.

IMD అధికారుల ప్రకారం, వచ్చే వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు, కనిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలోని బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలోని తుంగిలో మరియు ఒంగోలు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు కనిపించాయి.

గత 24 గంటల్లో విజయవాడలో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, నెల్లూరులలో 42.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. రాష్ట్రంలోని కర్నూలు, గుంటు, అనంతపురం మరియు ఒంగోలు వంటి అనేక ప్రాంతాలలో 40 డిగ్రీల నుండి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.