Hyderabad, August 19: నైరుతి రుతుపవనాలు మరియు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మేఘావృతంగా మారింది. అక్కడకక్కడ తేలికపాటి వర్షపాతం కూడా నమోదవుతుంది. వాయువ్య బంగాళాఖాతం మరియు ఉత్తర ఒడిశాలో రెండు రోజుల పాటు చురుకుగా ఉన్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. అయితే, దీని తదనంతరం జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర-దక్షిణ బేసిన్ గ్యాంగ్‌టక్ దగ్గర నుండి తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరతల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం వెంబడి బలమైన గాలులు వీచే సూచనలు కూడా ఉన్నాయి మరియు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి 48 గంటల వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది, రాయలసీమలో మరియు రాష్ట్రంలోని మిగతాచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాల గమనం చురుగ్గా ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ (FFR) హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. ఆగష్టు 19, 2021 వరకు వచ్చే రెండు రోజుల వరకు ఎల్లో మరియు అరెంజ్ అలర్ట్స్ కూడా IMD ద్వారా జారీ చేయబడ్డాయి.
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తద్వారా లోతట్టు ప్రాంతాలు జలమయమై తేలికపాటి వరదలు సంభవించ్చు, అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగానికి ఐఎండీ హెచ్చరికలు చేసింది.