AP CM YS Jagan |File Photo

Ananthapur, July 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ పరిశీలించారు. స్టాల్స్‌ను ప‌రిశీలించి రైతుల‌కు అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. అక్క‌డే మొక్క‌లు నాటారు. అనంతరం రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైయ‌స్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని అన్నారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇక కృష్ణా నీటి వాటాల విషయంలో తెలంగాణతో ఏర్పడిన వివాదంపై సీఎం జగన్ ప్రస్తావిస్తూ , తాము  పక్క రాష్ట్రాలతో విభేదాలు లేకుండా ఎప్పుడూ సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వేలు పెట్టలేదని,  రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టబోమని జగన్ అన్నారు.

జగన్ తన పర్యటనకు ముందు తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈరోజు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 72వ జ‌యంతి సంద‌ర్భంగా ఏపి సీఎం జగన్ ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు.

``చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా`` అంటూ వైయస్సార్ ను స్మ‌రించుకున్నారు.

Here's CM YS Jagan Tweet:

ఇడుపులపాయలో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు, వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకొని వైఎస్ షర్మిల ఈరోజు సాయంత్రం తెలంగాణలో తన పార్టీని ప్రకటించనున్నారు.