Hyderabad, August 12: పశ్చిమ మధ్య ప్రాంతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో ఆగస్టు15 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజా బులెటిన్లో పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఆగష్టు 15 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ఆంధ్ర, ఒడిషా మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే కొన్ని వివిక్త ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా ఆస్కారం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
ఐఎండీ సూచనల ప్రకారం, రాబోయే మూడు రోజుల నుంచి తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు నమోదు కావొచ్చు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ విషయానికి వస్తే, గత రెండు-మూడు రోజులుగా రాష్ట్రంలోని ఉత్తర భాగంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజుల వరకు వాతావరణం ఇలాగే కొనసాగవచ్చు అని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షం లేక ప్రజలు ఉక్కపోతను అనుభవించారు. అయితే ఐఎండీ హైదరాబాద్ తాజా సూచనల ప్రకారం మరో 5 రోజుల వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆగస్టు 15 తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని ఐఎండీ అంచనావేసింది.