Indian Railways (Image used for representational purpose only) (Photo Credits: PTI)

Secunderabad, August 20: రైల్వే రిజర్వేషన్‌ సేవలను ఈ నెల 21 నుంచి పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం మాడ్యూల్‌లో డిజాస్టర్‌ రికవరీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున ఆగస్టు 21, 22 మరియు 23 మధ్య తేదీలలో దక్షిణ మధ్య రైల్వే టికెట్ బుకింగ్ సేవలకు  సంబంధించి కొంత అంతరాయం కలుగవచ్చునని తెలిపారు. చార్టింగ్, కరెంట్‌ బుకింగ్, పీఆర్‌ఎస్‌ ఎంక్వైరీ, టికెట్‌ రద్దు, చార్జీల రీఫండ్ వంటి పీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

ఈ మేరకు 21వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు, తిరిగి 22వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయి. ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు. PRS విచారణ ప్రస్తుత బుకింగ్/PRS కౌంటర్లలో మాన్యువల్‌గా నిర్వహించబడుతుంది. ఈమేరకు ప్రయాణికులు ఏదైనా అసౌకర్యానికి లోనైతే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీనియర్ SCR అధికారి తెలిపారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో చాలాకాలంపాటు నిలిచిపోయిన రైల్వే సేవలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరించబడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడ పలు సేవల్లో అంతరాయం కలుగుతోంది.

ఇక, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో క్యాటరింగ్ సేవలను తిరిగి ప్రారంభించబడ్డాయి. లాక్డౌన్ కంటే ముందు ఉన్న సమయాల మాదిరిగానే, ప్రజలు ఆన్‌లైన్‌లో, కౌంటర్లలో, యాప్ ద్వారా లేదా రైల్వే స్టేషన్లలో ఇన్‌స్టాల్ చేసిన యంత్రాల నుండి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.  అయితే ఇప్పటికీ కరోనా వ్యాప్తి పూర్తిగా నివారించబడని నేపథ్యంలో AC కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు దుప్పట్లు మరియు దిండ్లు అందించటంలేదు. అలాగే ప్రయాణీకుల సౌకర్యం మరియు భద్రత కోసం ఇప్పుడు కోచ్‌లలో కర్టెన్లు కూడా తొలగించబడ్డాయి.

ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో అన్ని రైలు సర్వీసులు తిరిగి ప్రారంభించబడ్డాయి. ముందుగా రిజర్వ్ చేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లతో ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా రైలు సేవలను తిరిగి ప్రారంభించింది. లాక్డౌన్ కు ముందు కాలంలో సగటున ప్రతిరోజూ రూ. 10 కోట్లు వచ్చే SCR ఆదాయాలు ఇప్పుడు ప్రతిరోజూ రూ. 8 కోట్లు రాబడుతున్నాయి. మహమ్మారి సమయంలో గణనీయంగా పడిపోయిన ఆదాయం, ఇప్పుడు మరిన్ని రైళ్ల పునరుద్ధరణతో క్రమంగా పెరుగుతోంది.

సుదూర ప్రాంతానికి ప్రయాణించే రైళ్లు, ప్రత్యేకించి ఇంటర్-స్టేట్ అనుసంధానం కలిగిన రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎస్‌సిఆర్ తెలిపింది. దక్షిణాది నుండి ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ వంటి గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లకు అత్యధిక ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.