Hyderabad, April 16: కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది నిర్వహించే ఎస్‌ఎస్‌సి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకొని సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా మే 17 నుంచి జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే ప్రత్యామ్నాయంగా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష ఆధారంగా పదో తరగతి విద్యార్థుల ఫలితాలు నిర్ణయిస్తామని విద్యాశాఖ పేర్కొంది. బోర్డు ఇచ్చే మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే, అలాంటి వారి కోసం పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షల విషయానికి వస్తే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నేరుగా సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయబడతారని తెలిపింది. పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. మే 1 నుంచి మే 19 వరకు జరగాల్సి ఉన్న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Here's the update:
Higher Education Department - Promotion and Rescheduling of Intermediate Exams. pic.twitter.com/epQSyjTGB5
— IPRDepartment (@IPRTelangana) April 15, 2021
జూన్ మొదటి వారంలో మరోసారి సమీక్ష నిర్వహించి అప్పటికి పరిస్థుతులు బాగుపడితే 15 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వబడతాయని విద్యాశాఖ పేర్కొంది.
ఎంసెట్ పరీక్షలో 25 శాతం ఇంటర్ మార్కుల వైటైజీని కలపడం లేదని విద్యాశాఖ కమీషనర్ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.